Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

భారతీయసంస్కృతి

''ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః

మామకాః పాండవాశ్చైవ కి మకుర్వత సంజయ!''

ఈ మాటలు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణీ చూచి చెబుతున్నాడు. సంజయ అనే పేరు బాగా కుదిరింది. ఇది భగవద్గీతలో మొదటి శ్లోకం. సంజయ అనగా 'సత్‌'గా ఉంది. జయ, జయమును పొందుము లేక పొందగలవు అనే భావము సత్‌, సన్‌, సంతో, సంతః అను మాటలు మంచి ఉత్తమమైన అనే భావంమీద ఆధారపడి ఉన్నవి. జయ అంటే జయం కలుగుగాక అని గీత ప్రారంభంలో 'సంజయ' అనే పదం సాభిప్రాయంగా వాడబడింది. ఇదివరకు భారతకథలు దేశంలో విరివిగా ఉండేవి. ఈ సదస్సుల భారతమే మనకు జయం. సర్వ జయప్రదం. అందులో ఆదర్శపురుషుల స్మరణ మన ప్రజలు చేస్తున్నంతవరకూ మనం తలపెట్టిన అన్ని కార్యాలూ జయ ప్రదము లవుతుంటవనటంలో సందేహం లేదు.

మన దేశంలో ఆంధ్ర, ఓఢ్ర, మహారాష్ట్రం, కర్ణాటకం, అరవం, ఘూర్జరం, హిందుస్తానీ, బెంగాలీ , అస్సాం, రాజస్థాన్‌, మిథిల, నేపాళం మొదలైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వీటికి పొరుగుననే కాంభోజం (కంబోడియా) శ్యామదేశం ( సయాం) లంక (సిలోన్‌) లాంటి దేశాలలో కూడ పూర్వం మన సంస్కృతశాస్త్రాలే వాడుకలో ఉండేవి. ఈనాడు వారు బౌద్ధులుగానూ, మహమ్మదీయులుగానూ ఉన్నప్పటికీ, వారి సంస్కృతికి మూలం ఈ భారత రామాయణాలే.

మనదేశంలో ఎన్ని ప్రదేశాలు ఉన్నాయో, అన్ని దేశాలు మనసంస్కృతి మీద ఆధారపడినవి. బయటకూడా ఉన్నాయి. లావోస్‌, జావా, సుమిత్ర, బాలి మొదలైన దాదాపు రెండువేల ద్వీపాలు, ఇండోనీషియా, పరిసరాల్లో ఉన్నాయి. వానిలో పది, పదిహైదుబాషలు మాట్లాడుతున్నారు. బోర్నియాభాష వేరు, బొలినీప్‌ భాష వేరు జావాలోనే రెండుమూడు భాషలు ఉన్నాయి. మలేషియా భాషలు వేరు. కానీ వీటికన్నిటికీ పునాదులు, రామాయణ భారత గాథలే. మనదేశంలోని విమానసర్వీసును, ఏర్‌ ఇండియా సర్వీస్‌ అనీ ఏమోమో అంటారు. అక్కడ జావాలో, ఇండోనీషియావారు నడిపే విమాన సర్వీసుకు 'గరుడ' అని పేరు పెట్టారు. లంకవారు 'హనుమాన్‌' అని పేరుపెట్టారు. పోతే మనమో, భారతదేశంలో 'సెక్యులర్‌'గా పేరుపెట్టాం.

( 9 - 14 )

లంకలోనివారు బౌద్ధులు. ఇండోనీషియావారు మహమ్మదీయులు. ఈ మధ్య ఒక ఇండోనీషియా విమానం ప్రమాదంలో కూలిపోయిందని, పేపర్లలో వచ్చింది. అది గరుడ విమాన సర్వీసుకు చెందినదని పేపర్లు వ్రాయగా ఆదేశంలో విమాన సర్వీసుకు చెందినదని పేపర్లు వ్రాయగా ఆదేశంలో విమాన సర్వీసుపేరు 'గరుడ' అని మనకు తెలిసింది. ఐతే ఆ దేశంలో స్వాతంత్య్రం రాగానే, గరుడ అని పేరు పెట్టుకొన్నారు. అందుచేత వారు మనదేశాన్ని విదేశంగా భావించినా, మనసంస్కృతిని మాత్రం ఇంతవరకూ ద్వేషించలేదు; అసహ్యించుకోలేదు - మనదేశంలో సంస్కృతం ఏదో గొప్పగా వ్యాప్తి చెందినదనే ఉద్దేశంతో ఆ దేశస్థులు కొందరు ఈ దేశానికి రావటం, వచ్చిన తర్వాత ఇక్కడ సంస్కృతానికి పట్టిన దుర్దశను చూచి, మీ దేశం కంటే మాదేశ##మే నయమని వెళ్ళిపోవడమూ జరుగుతున్నది.

ఈ సదస్సు మొదలు పెట్టినపుడు మొదటి సంవత్సరం సభలో, ఢిల్లీలోని ఏంబెసీలోని ఒక వ్యక్తి వారిదేశంలో 'హనుమంతుని నర్తనం' చేసే కళాకారుణ్ణి తెచ్చి, హనుమన్నర్తనం చేయించారు. అది చాల గొప్పగా ఉంది. మన దేశంలో అటువంటి నర్తనం కాని, భావములుకానీ ఎక్కడా మనం చూడలేము. అంతబాగా అభినయించాడు. ఆయన ఒక విషయం చెప్పాడు.

''ఒకసారి రవీంద్రనాథ టాకూరు మాదేశం వచ్చారు. (వెనుక వారిది సయాం దేశం. దానికి ఈనాడు తాయిలెండు అని పేరు పెట్టుకొన్నారు.) ఆయన మాదేశంలోని సాంస్కృతిక వ్యవహారాలు చూచి - ౄుషస ఈుషnషసా పుస| ఒndశn షఠశn ఒndశ అని ఎంతో సంతోషముగా ప్రసంగించారు. మాదేశంలో ప్రతి విషయమూ సంస్కృతం ప్రాతిపదికగా, పేరూ, పారిభాషిక పదాలూ, అన్నీ తయారు చేసుకొన్నాం. ఈ విషయంలో మీ దేశం కంటే మేమే మెరుగు''

జావాలో ఒకరిపేరు సుహృతో - మరొకరి పేరు సుకర్ణుడు వారు మహమ్మదీయులైనా, పేర్లు భారత రామాయణ గాథలకు సంబంధించినవే. పాపం ఈ విదేశీయులంతా మనదేశానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సంస్కృతం మాట్లాడే వాళ్ళే అని అనుకొని వస్తున్నారు. మనస్థితి ఎలా ఉందంటే, ఏ యూనివర్శిటీకి వెళ్ళినా, సంస్కృతం మాకురాదు అంటే మాకురాదు అని పోటీపడేవాళ్ళే వాళ్ళకు కనిపిస్తున్నారు. అది చూచి వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. ఇండియాలో ఉన్నవాళ్ళంతా ఋషులేమో, సంస్కృతజ్ఞానం కలవారేమో అని ఇక్కడకు వచ్చి విసుగెత్తి వెళ్ళిపోతున్నారు. మనవాళ్ళు కొందరు, సంస్కృతం అభిమానించే జర్మనీ లాంటి దేశాలకు రాజదూతలుగా వెళ్ళినపుడు ఆ దేశం వాళ్ళు వీళ్ళెంత సంస్కృత విద్వాంసులో అని సంబరపడుతారు. జర్మనీ, బ్రిటన్‌ లాంటి దేశంలో యూనివర్శిటీలలో సంస్కృతాధ్యయనానికి ఉన్నన్ని పీఠాలు (ఈఠశస) మనదేశంలోనే లేవు. చివరకు మనవాళ్ళు అక్కడకు పోయి మాకు సంస్కృతం రాదంటే మీ కులమేమిటి? అని వారడుగుతారు. కొందరు బ్రహ్మణులమని అంటారు. అయితే బ్రాహ్మణులై ఉండి మీకు సంస్కృతం రాదా? అని ఆశ్చర్యపడతారు. ఆ దేశాల్లో సంస్కృతాధ్యయనానికి తమ జీవితాలు అర్పణ చేసిన వారెందరో ఉన్నారు. వారు మనదేశానికి వచ్చిన ఘట్టాలూ ఉన్నాయి. ఇక్కడ సంస్కృతానికి గలస్థానాన్ని చూచి వారు ఏవగించుకొని పోతున్నారు.

ఇదంతా నేను చెప్పడానికి కారణం ఏమంటే మనదేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నవో, అన్ని దేశాలు ఈ ఇండియాకు బయట ఉన్నవని ఈ దేశాలను అన్నిటినీ కలిపి లావోస్‌ వరకూ చరిత్రకారులు గ్రేటర్‌ ఇండియా అని అంటున్నారు. పూర్వం గాంధారమని చెలామణి ఐనచోటు నేడు ఉన్న పుష్టోభాషలో సంస్కృత ప్రభావం ఎక్కువ అని అంటున్నారు. ఇవిగాక మధ్యాసియా, సైబీరియా మొదలైన చోట్ల, కొన్ని ప్రాచీన చిత్రాలలో కాళిదాసు కావ్యాలలో కనిపించే వర్ణనలకు నకళ్ళు చిత్రాల రూపంలో కనిపిస్తాయి. బాబిలోనియాలో క్రీ.పూ. 1400 సం|| ప్రాంతమున ఇద్దరు రాజులు పరస్పరం ఒడంబడిక చేసుకొన్నట్లు ఆ సంధి షరతులకూ, ఒడంబడికకూ, సాక్షులుగా మిత్రావరుణులను సాక్షులుగా పెట్టుకొన్నట్లూ ఆనాటి ఇటిక రాళ్లపై వ్రాసినది కనిపిస్తున్నది. ఆనాటి లిపిని గుర్తించే నిపుణులు, వైదిక దేవతలయిన మిత్రావరుణులనే సాక్షులుగా వాళ్ళు పెట్టుకొన్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

పూర్వకాలంలో మనదేశ సాహిత్యంలో, వచనరచనలు చాల తక్కువగా ఉండేవి. తెలుగు, మహారాష్ట్రం, అరవం మొదలైన భాషల్లో వచనరచన విరివిగా ప్రారంభ##మైనదని విన్నాను. ఆంధ్రంలో వీరేశలింగం పంతులుగారు వచనరచనకు ప్రోద్బలం ఇచ్చారని విన్నాను. ఇలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరూ ఇంగ్లీషులోని వచన సాహిత్య ప్రభావం వల్ల ఈ పరిణామం ఏర్పడి ఉంటుంది. కాని పూర్వం చదువంతా పద్యాలు, శ్లోకాల రూపంలో ఉండేది. వచనకావ్యాలు ఆనాడు లేవు. ఒకటీ అరా; వ్యాకరణాలేవైనా ఉండేవేమో! వానిలోనూ లక్షణాలు పద్యరూపంలో ఉండేవి. వివరణమాత్రం వచనరూపంలో ఉండేది. ఆనాడు ఉత్తరాలూ పద్యాలలో వ్రాసుకొనేవారు.

సంస్కృతంలో మాత్రం 1500 ఏళ్ళ ముందు ఒక నాలుగైదు వచన రచనలున్నా, అవీ ఛందోబంధాలు మాత్రము లేక, తక్కిన విషయాలలో, శ్లేషాలంకారాలు, అనుప్రాసలు, విరోధాభాసాలు, లాంటి పద్యకావ్యములలో కనిపించే లక్షణాలతో ఉండేవి. దశకుమార చరితం, అవంతీ సుందరి కథ, కాదంబరి, హరచరిత, బాణభట్టు రచనలు మొదలైనవి. నిజానికి వచనకావ్యం అని మనం ఏదైనా చెప్పుకోగలిగితే అది ఒక్కటే - విక్రమార్కచరితం. అందులో వచనరూపం మనకు కనిపిస్తుంది.

ఇలా పూర్వకాలంలో కేవలం పద్యరచనలు చేసినందువల్ల కలిగిన లాభ##మేమంటే, మనం అన్ని విషయాలనూ కంఠస్థం చేయవచ్చు. అందరూ వల్లించేదానికి వీలుగా ఆనాడు వాళ్ళు రచనలు చేశారు. చివరకు నిఘంటువులు కూడా పద్యాలలో, శ్లోకాలలో వాళ్ళు వ్రాశారు. అమరకోశం, మేదినీ మొదలైనవన్నీ పద్యాలలో ఉన్నాయి. ఏదన్నా ఒక విషయం వివరణకావలసి, నిఘంటువు చూడవలసి వస్తే ఆ పుస్తకం కోసం పరుగెత్తకుండా నోటితో వెంటనే శ్లోకాలలో ఒప్పచెప్పేవారు. వేదాంత దర్శనశాస్త్రాలన్నీ పద్యాలలోనే ఉన్నాయి. యోగవాసిష్ఠం, - పంచదశీ పద్యాలలోనే ఉన్నాయి. వైద్యం, ఆయుర్వేదం పూర్తిగా శ్లోకమయం. లెక్కలు, అరిథ్‌మెటిక్‌ పద్యం. జామెంట్రీ పద్యం, అరిథ్‌ మెటిక్‌ లీలావతి అనే పేరుతో భాస్కరాచార్యులు వ్రాశారు.

పద్యాలలో అంకెలను చెప్పవలసి వస్తుంది కదా! వాటిని నిబద్ధించడం ఎలా? అందుకు ఒకపద్ధతి ఏర్పాటు చేశారు. దానిని ' క ట ప యా ది' సంకేతం అని అంటారు. అంటే ఫలానా అక్షరం ఫలాని సంఖ్యను సూచిస్తుందని పెట్టుకొన్నారు. 'క' మొదలు కాదినవ, టాదినవ, పాదిపంచ, యాద్యష్టౌ అని సంకేతాలు, క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ - ఇవి 'క' మొదలు ఝ వరకు తొమ్మిది - ఇవి ఒకటి మొదలు తొమ్మిది వరకు గల సంఖ్యలను సూచిస్తాయి. ఇలాగే టాదినవ - 'ట ఠ డ ఢ ణ త థ ద ధ' వరకూ తొమ్మిది. పాదిపంచ - ప ఫ బ భ మ ఇవి 5 అంకెలను గుర్తించేందుకు ఉపయోగపడుతవి. యాద్యష్టౌ - 'య' మొదలు 'హ' వరకు ఎనిమిది అక్షరాలు - య ర ల వ శ ష స హ. పద్యంలో అన్వయం కాకుండా మధ్యలో ఏదైనా ఒక పదం అక్షరం ఉంటే అద లీలావతి అరిథ్‌ మెటిక్‌లో గానీ, ఆల్‌ జీబ్రా బీజగణితంలో గానీ వచ్చినట్లైతే, దానికి ఫలానా అంకాన్నీ గుర్తించే పదం ఇది అని అనుకొని, ఆ అక్షరం ఏ అంకెను సూచిస్తుందో తెలుసుకొని నిర్ణయించమంటారు. 'అంకానాం వామతోగతిః' అని ఇది మరొక రహస్య సంకేతం. అంటే అంకాలను గుర్తించే అక్షరాలన్నిటినీ, తల్లక్రిందులుగా గ్రహించాలి. అక్షరాలు 81 సూచిస్తే దానిని 18 గా గ్రహించాలి. ఇందులకు ఒక ఉదాహరణ చెబుతాను. ఆదిశంకరులు సిద్ధిపొందినపుడు వారి వయస్సెంత? దీనికి ఒక శ్లోకం చెబుతారు.

'మహేశాంశాజ్జాతః' వారు ఈశ్వరాంశలో పుట్టారు. మధుర ముపదిష్ట అద్వయనయః' అతికఠినమైన అద్వైత వేదాంత శాస్త్రమును రుచ్యంగా ఉండేటట్లు ఉపదేశించి బోధించిన మహాగురువులు 'మహోమోహధ్వాంత ప్రశమన రవిః' మనలను ఆవరించుకొన్న మహామోహాలనే చీకటి తెరలను తొలగించే భాస్కరుడు, ఆయన ఉన్న చోట ఎలాంటి మోహాలూ ఉండటానికి వీలులేదు. 'షణ్మతగురుః' అనేకులు ఆచార్యులు, ఒకే ఒక మతాన్ని, ఒకే ఒక దైవాన్ని పెట్టుకొని అదే మార్గమని బోధించేవారు శైవులు శివుడే దైవమని బోధించారు. బసవలు, ఆరాధ్యులు, లింగాయతులు మొదలైన వారికి శివుడొక్కడే దేవుడు. అలాగే శ్రీవైష్ణవులు, మాధ్వులు కేవలం విష్ణువునే ఆరాధిస్తారు. 'ఏకో దేవః కేశవో వా శివోవా' ( అంటే ఏదో ఒక దేవుడు - కేశవుడో శివుడో తప్ప వేరే దేవుడు మనకు అవసరం లేదు) అనే దృష్టిని బోధించారు. ఆ ఆచార్యులంతా. అటువంటి స్థితిలో శ్రీ శంకరాచార్యులు - పరమాత్మ ఒక్కడే. అతనిని వైష్ణవులు రాముడనీ, నృసింహుడనీ, మత్స్యవరాహ స్వాములుగానూ కొలిస్తే, శైవులు శివుడుగా పూజిస్తారు. స్త్రీ రూపంలో సరస్వతిగా కొందరు, ఆ పరమాత్మనే ఆరాధిస్తారు. పార్వతిగా, లక్ష్మిగా అర్చిస్తారు. ఆమె బ్రహ్మవిష్ణుశివాత్మికగా ఉంది. అన్ని స్వరూపాలూ ఒకే ఒక అద్వయతత్త్వమైన పరబ్రహ్మకు చెందినవే అని కంఠోక్తి కావించారు. ఒకే పరమాత్మ నానా రూపాలు తాల్చినప్పటికీ, అందులో ఏ రూపాన్ని మనం ఆరాధించినా, పరమాత్మను చేరగలం. వీనిలో ముఖ్యంగా ఆరురూపాలను ప్రధానంగా భావించి, షణ్మతములను స్థాపించారు. అవి శైవం, వైష్ణవం, శాక్తం, గాణాపత్యం , సౌరం, సుబ్రహ్మణ్యం అనేవి. ఇపుడు మనం గణపతి, శక్తి, సూర్యడు, సుబ్రహ్మణ్యుడు అని ఏఏ మూర్తులను ఉపాసిస్తున్నామో అవన్నీ కూడా ఒకే పరమాత్మ అని సమన్వయం చేసి. షణ్మత గురువులయ్యారు.

'ఫలే స్వస్మిన్‌ స్వాయుష్యపిచ'

శంకరులకు, తన ఆయుస్సుకు తగిన ఫలం లభించింది. అంటే జీవితం చరితార్థమైంది. ప్రపంచం ఉన్నంతవరకూ, అద్వైతం ఏకచ్ఛత్రంగా అధికారం చేయటమే ఆయన జీవిత లతకు ఫలం. ముందు ముందు ప్రపంచంలోని ఏ దేశాలలోనైనా ఏ మతాలు తలెత్తినా, సరే నిజమైన తత్త్వం తెలుసుకోవాలి అంటే ఆతత్త్వదర్శనం భారత దేశంలోనే లభ్యమయ్యేటట్లు చేశారు.

పాశ్చాత్య వేదాంతు లెందరో తత్త్వ స్వరూపం తెలుసుకోవాలని కుతూహలం కలిగినపుడు' ఇండియాకు వచ్చి, శంకరాచార్యులు తత్త్వాన్ని గూర్చి ఏమి చెప్పారా అని విచారించేవారు. ఆ విధంగా శంకరాద్వైతాన్ని ప్రధానమైన రెఫరెన్స్‌గా నేడుకూడా విదేశీయులైన తత్త్వాన్వేషకులు, ఆశ్రయించడం మనం చూస్తున్నాం. ఇప్పటికి శంకరులు వెళ్ళిపోయి వెయ్యి, రెండువేల సంవత్సరములు అయినా, వారు ప్రతిపాదించిన తత్త్వం నిత్యనూతనంగా ముముక్షువులకు ఉపాదేయంగా నిలిచిపోయింది. ఇది ఇలాగే శాశ్వతంగా ఉంటుంది. రాజ్యాలు రావచ్చు పోవచ్చు. దేశాలు ఉండవచ్చు. ఊడిపోవచ్చు. కాని ఈ అద్వైతతత్త్వం మాత్రం అన్నిరకాల ఉపద్రవాలనూ ఉపప్లవాలనూ అధిగమించి, శాశ్వతంగా ఉండిపోతుంది. సూర్యుడి లాగ ప్రకాశవంతంగా నిలిచి ఉంటుంది.

( 9 - 15 )

'ఫలేస్వస్మిన్‌' అంటే అవతారఫలం పూర్తి అయింది. ఈ ఫలమేమిటి? స్వస్వరూప జ్ఞానప్రాప్తియే. రెండవది అంటూ లేకుండా , లోపల నేను నేను, అనే జ్ఞానం ఒకటి ఉన్నది. అన్నీ తెలుసుకొనేది ఆజ్ఞానమే. అన్నింటికీ ఫలం అదే. అదే సర్వత్రా నిండి ఉన్నది. ఏ శరీరంలోఉన్న జ్ఞానమైనప్పటికీ, ఒక్కటే ఇక్కడ మనం చూస్తున్న బల్బులన్నిటిలోనూ ఒకే విద్యుత్తు ఉన్నట్లు స్విచ్చి వేస్తే వెలుగుతుంది. స్విచ్చినొక్కితే ఆరిపోతుంది. ఈ బల్బులలో కొన్ని ఎర్రవి, కొన్ని పచ్చనివి, కొన్ని తెల్లనివి వివిధ రంగులలో ఉన్నాయి. చిన్న బల్బులూ, పెద్దబల్బులూ ఉన్నాయి. సృష్టిలో ఉండే కోట్లాది శరీరాలూ అట్టివే. వీనిలో పనిచేసేశక్తి మాత్రం ఒక్కటే. ఈ బల్బులు ఒకదాని కొకటి కొట్టుకొంటే పగిలిపోతాయి. అట్లే సృష్టిలోని మానవశరీరాలూ, పోట్లాటలూ, యుద్ధాలూ వస్తే నశిస్తవి. కానీ లోన ఉన్న, తత్త్వం, అసలు వస్తువు ఒకటే.

అవతారాలలో కూడా ఇది సమానమే. బలరాముడూ కృష్ణుడూ ఘరణపడ్డా, రాముడూ పరశురాముడూ పోరాడినా, వారిలో ఉన్నతత్త్వమేమో ఒక్కటే. ఒకే విష్ణవు రెండు రూపాలలో లీల చూపిస్తున్నాడు. అలాగే ఎక్కడ చూచినా, ఏ శరీరంలో చూచినా, 'నేను నేను' అనే తత్త్వం ఒకటే. ఇక్కడ దీపం ఉన్నది. వెలుగు ఉన్నది. వస్తువులు కనబడుతున్నాయి. వెలుగూ, దీపంఉన్నా, కన్నులు లేనివాడు చూడలేడు. కన్ను ఉండి మూర్ఛలో వుంటే మనిషి చూడలేడు. మూర్ఛదశలో కూడా మనసు కావాలి వస్తువులను తెలుసుకోడానికి.

ఆ మనస్సునుకూడా, 'నా మనస్సు' అన్నప్పటికీ, 'నేను' అనే 'చిత్‌' ఒకటి ఉంటేనే కాని పనిచేయదు, అందుచేత అన్నింటికీ ప్రకాశం, లోపల వుండే 'అహం అహం' అనేది ఒక్కటే. అదెప్పుడు స్ఫురిస్తుందో అప్పుడే దానిని ప్రకాశమని అంటాం. అదే శతృవులోనూ మిత్రునిలోనూ ఉంటుంది. ఇదే వేదాంతం. ఇదే ఫలం. స్వస్వరూపం పై మెట్టు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, పిపీలిక - ఈ నాలుగింటిలోనూ ఉన్న స్ఫూర్తీ,' వెలుగూ ఒక్కటే.

'ఫలే స్వస్మిన్‌ స్వాయుష్యపిచ' తన (శంకరుల) ఆయుష్యంలో కూడా ఫలమున్నది. అది స్వరూపఫలం. కాగా ఆయుస్సు యొక్క ఫలం కూడా ఉన్నది. ''చర్లా చరాబ్దేపిచ, కలేః వివిల్యే, రక్తాక్షీణి, అదివృష, సిత, ఏకాదశిపరే-'' అని ఈ సంవత్సరం. ఈమాసం, ఈ పక్షం అని ఈ శ్లోకంలో ఉన్నది. ఇది శంకరులను గురించి పరంపరగా వచ్చిన పుణ్యశ్లోకం. తన ఆయుస్సులో ఫలం అంటే అర్థం కావడం లేదు. వారి ఆయుర్దాయ మెంత? వారిని గురించి తెలిసినవారంతా 32 ఏళ్ళని అంటారు.

'ఫలేస్వస్మిన్‌' స్వస్వరూపమైన ఫలంలో 'వివిల్యే' లయాన్ని పొందారు. తన ఆయుషులో ఫలంలో లయం పొందారని అర్థం. తన ఆయుస్సులో ఫలం అంటే? నేను పైన పాదిపంచ అని చెప్పాను. పఫ అంటే రెండు. ఇక్కడ ఆయుస్సు అంటే వయస్సు లెక్క. యాద్యష్టౌ యరల - 3 అవుతుంది. అంటే ఫలే అనగా 23 అని అర్థం. అంకానాం వామతోగతిః అంకెలు తలక్రిందులు చేస్తే - 32 అవుతుంది. ఫలేస్వస్మిన్‌ స్వాయుష్యపి - అంటే తన వయస్సు 32 అయి ఉండగా వివిల్యే', సిద్ధి పొందారని, ఆ పుణ్యశ్లోకానికి అర్థం. ఇలా శ్లోకం లోనే సంఖ్యలను సంకేతింపచేయడానికి ఇది ఒక ఉదాహరణం. యాద్యష్టౌ అనే సూత్ర ప్రకారం,ఫలే అనేపదానికి ఇలా అర్థం చెప్పుకోవాలి.

ఇక ప్రకృతాన్ని అనుసరిద్దాం. మనభారతం ఉన్నంత వరకూ ఎప్పుడూ జయమే మనదేశానికీ, మనకూను. భారతం ఎప్పుడూ ఉంది. ఉంటుంది. దానిని స్మరించుకొంటూ వృద్ధిపరుచుకోవాలి. హృదయాలలో చెరగని స్థానం ఇవ్వాలి. అందులోనే అన్ని ఆదర్శాలూ ఉన్నాయి. ధర్మపుత్రుడు. భీష్మాచార్యులు ఆదర్శపురుషులు. దానంలో కర్ణుడు, భక్తిలో పరీక్షిత్తు, ఆదర్శపురుషులు, ఆ భారతమే భాగవతమైంది. అభిమన్యుడు భారతదేశంలోని నాడైతే అతని పుత్రుడు భాగవతంలో ప్రముఖుడయ్యాడు. కాగా ఆ భారతం ఉన్నంత వరకూ, భగవద్గీత ఉన్నంత వరకూ మనకు జయం.

నారాయణం నమస్కృత్య నరంచైవ సరోత్తమం|

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌ - ||

భారతారంభంలోని శ్లోకం ఇది. నారాయణం నమస్కృత్య - నరనారాయణులిద్దరు. నరుడే అర్జునుని స్వరూపం. నరంచైవనరోత్తమం.

నరనారాయణులు బదరికాశ్రమంలో తపస్సు చేశారట. అసలు నారాయణునికి తపస్సే అక్కరలేదు. అది ప్రజాక్షేమకరం కనుక, దానిని తానే చేసి ఇతరులకు మార్గం చూపాలని ఆయన తపస్సు చేశారు. కృష్ణుడు అర్జునుడి చేత యుద్ధం చేయించినట్లుగానే, తపస్సు చేయించడానికీ ఆదర్శమైనాడు. మామూలుగా ఎవరైనా కఠోరమైన తపస్సు చేస్తే ఇంద్రుడు భయపడుతాడు. తపోబలం వల్ల ఇంద్రపదవిని వాళ్లు అధిష్ఠిస్తారేమో అని. అలాగే ఇపుడు కూడా నరనారాయణుల తపస్సు భంగం చేయడానికి అప్సరసలను, తన సైన్యాన్ని పంపాడు. వారిని చూచి నరుడికి కోపం వచ్చింది. వారిని భస్మం చేయడానికి సిద్ధపడినాడు. నారాయణుడు నరుణ్ణి శాంతపరచి, చిరునవ్వు నవ్వి, తన ఊరువును (తొడను) స్ఫాలనం చేశారట. అపుడు ఆయన తొడలోనుంచి ఒక మహారూపసి వెలువడింది. ఆమె లావణ్యం హావభావ విలాసాన్ని చూచి అప్సరసలు ఆశ్చర్యపోయారు. సిగ్గుతో తలవంచుకొన్నారు. ఇలాంటి స్త్రీరత్నాన్ని సృష్టించ గలవానిని తాము ఏమి వశపరచుకోగలమని అనుకొన్నారు. నారాయణునకు నమస్కరించి క్షమాపణ కోరుకొన్నారు. ఆ స్త్రీ పేరే ఊర్వశి, నారాయణుడు ఆ ఊర్వశిని కూడా అప్సరసలకు అప్పగించి, ఈమెనుకూడా మీరు తీసుకొని వెళ్ళండి అని అన్నాడు.

నరనారాయణులు అట్టివారు. వారికి భారతం చెప్పేదానికి ముందు నమస్కరించాలి. ''నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం'' ఆనరుడే నరోత్తముడైన అర్జునుడుగా జన్మించాడు. ''దేవీం సరస్వతీం వ్యాసం'' - తర్వాత 'తతో జయముదీరయేత్‌ - అంటే 'జయం' చెప్పు అని అర్థం. జయం చెప్పడమేమిటి?

కాదినవ అని చెప్పాను క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ 'జ' ఎనిమిదవ అక్షరం యాద్యష్టములో 'య' మొదటి అక్షరం జయ - అనగా 81 దానిని తిరుగేస్తే 18- అనగా భారతం. భారతం పద్దెనిమిది పర్వాల మహాగ్రంథం. భారత యుద్ధం 18 రోజులు నడిచింది. ఆ గ్రంథానికి ప్రాణంలా ఉన్న భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలున్నాయి. కాబట్టి జయ అంటే భారతం చెప్పటం. భగవద్గీతలోకూడా ప్రారంభంలో సంజయ అనే మాటలో ఈ అర్థమే గర్భితమై ఉంది. 'తతో జయ ముదీరయేత్‌' అని భారతలో చెప్పితే - ఇక్కడకూడా

'ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః

మామకాః పాండవాశ్చైవ కి మకుర్వత సంజయా'|

అంటూ గీత ప్రారంభం అవుతుంది.

భారతమే ఒక జయం. అందులో భగవద్గీత మరొక జయం. సంజయ అనేది మంచి పేరు. సన్‌ అంటే మంచి అని అర్థం. ఇంగ్లీషువాళ్ళు కొడుకును మంచివాడుగా ఉండాలన్న అభిలాషతోనేమో, సన్‌ అని అంటారు. ఇక చివర శ్లోకం ఎత్తు కొంటే - అది విశేషమైన జయం.

యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్థరః||

తత్ర శ్రీ ర్విజయో భ్భూతి ధ్రువానీతి మతి ర్మమ||

విజయం విశిష్టమైన జయం. అంటూ వ్యాసులు పూర్తి చేశారు. ఇదంతా సంస్కృతంలో గణితంకూడా శ్లోకాల్లో చెప్పే ఆచారం వుందని చెప్పడానికి చెప్పాను. ఇలా పద్య రూపంలోనే శాస్త్రాదులు నిబద్ధింప బడుటవల్ల తెలిసినవారు అడవుల్లో ఉన్నా పుస్తకాల అవసరం లేకుండా వాటి పఠన బోధన జరుపుకోడానికి చక్కని అవకాశం ఉంటుంది. ఆవీలును మనపూర్వులు బాగా వినియోగించు కొన్నారు. జామెట్రీ అంటే జ్యామితి. అన్నీ నోటితోనే చేసుకొనేవారు. జ్యా అంటే సంస్కృతంలో భూమి అని అర్థం. మితి అంటే మానం. కొలత, జ్యాగ్రఫీ, జ్యామెట్రీ అనే చోటల్లా జ్యా అంటే భూమి అనియే అర్థం శ్లోకరూపంలో ఉన్నపుడు శాస్త్రాలను జిహ్వాగ్రంలోనూ, గణితాన్ని అంగుళ్యాగ్రంలోనూ ఉంచుకొని పని గడుపుకోవచ్చు.

ఈ పండ్రెండు రోజులుగా నడచిన ఈ సదస్సుకు 'వ్యాసభారత ఆగమ శిల్ప జానపద, సదస్సు' అని సుదీర్ఘమయిన పేను పెట్టాం. ఇందులో ముఖ్యం వ్యాసభారతం అనే మాటలు ''దేవీం సరస్వతీం వ్యాసం, తతో జయముదీరయేత్‌'' అన్నింటికీ మూలము వేదవ్యాసులు. వారిని మరవరాదు. అందుచేత భారతానికి జయమని పేరు. గీతలో ఆద్యంతాలలో జయ, విజయ అనే మాటలున్నాయి. మన దేశంలో - మనదేశంలోనే కాదు- నిజానికి మన దేశం అనటంకూడా సరికాదేమో - నిజానికి అన్నీ మనదేశాలే. అన్నీ క్షేమంగా ఉండాలి.

మాతా చ పార్వతీ దేవీ, పితా దేవో మహేశ్వరః|

బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం||

ఈ శ్లోకానికి వేరే అర్థమేమీలేదు. స్వదేశో భువన త్రయం దీనికి మకుటం.

స్వదేశం అంటే భువనత్రయం. ప్రపంచాన్నీ లోకాలనూ గురించి మన కెంతవరకు తెలుసునో అదంతా మన దేశేమే అన్నమాట. అఖిలాండకోటి బ్రహ్మండం అంటాం. ఈ విశ్వంలో కోటికోటి అండములున్నవి. జాగ్రఫీలో భూమి చిత్రాన్ని - కుక్కుటాండం (కోడిగ్రుడ్డులాగ)లా గీస్తారు. అంతరాళానికి (ాూశ-|) అంతు అంటూలేదు. అందులో మన భూమి ఒక చిన్న చుక్కలాంటిది. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో? ఎన్ని సూర్యమండలా లున్నాయో? ఎన్ని గ్రహాలు వాటిని చుట్టుతున్నవో చెప్పలేం. ఈ కనిపించే సూర్యుడు, ఇతర సూర్యులను ఎందరిని చుట్టి తిరుగుతున్నాడో మనకు తెలియదు - అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు అనిపిలుపబడే ఆ ఒక్క పరమాత్మకే తెలుసు. మనంమాత్రం స్వదేశో భువనత్రయం అంటే పైన ఉండే లోకం, మధ్య ఈ మనలోకం, క్రింద ఉండేలోకం - ఈ మూటినీకలిపి మనదేశంగా వ్వవహరించాలి.

పూర్వకాలపు పద్ధతులలో సంస్కృతం చదివిన పండితులను మినహాయిస్తే ఈనాటి చదువులు చదివిన వారూ, రాజకీయనాయకులూ, ఉపన్యాసం ఇవ్వడానికి ముందు 'సోదర సోదరీమణులారా? అని సంబోధిస్తారు. అంటే వినేవాళ్ళాంతా అక్కచెల్లండ్రనీ, అన్న దమ్ములనీ భావం. పోతే పండితులు ఏదో స్వస్తిమంత్రాలతో మనకందరకూ సుఖశాంతులు కావాలంటూ ప్రారంభిస్తారు. ఆధునికులు సోదరసోదరీమణులారా అంటూ ప్రజలకుగల కష్టాలను ఏకరువుపెట్టి, వాటిని తొలగిస్తామంటూ,ఏమేమో చెబుతారు. ఇలా అందరూ సోదరసోదరీలుగా భావింపబడితే మరి తల్లిదండ్రులు ఒక్కరే కదా ఉండాలి. ఆ అర్థమే ఈ శ్లోకం లో ఉంది. ''మాతా చ పార్వతీ దేవీ' పితా దేవో మహేశ్వరః'' ఐతే ఈ విషయాల్ని నేటి వారు మాత్రం ఒప్పుకోరు. అది ఒప్పుకొన్ననాడు ''స్వదేశో భువనత్రయం'' అన్నమాట నిజమౌతుంది.

( 9 - 16 )

అందరికీ ఈ భావం కలిగిననాడు పార్టీలు, కక్షలు పోటీలు, ఒకరినిజయించడం, ఒకరిచేత జయింపబడటం అంటూ ఉండదు. అపుడు జయానికి అవసరమే ఉండదు. అయితే అప్పుడు జయమనేమాటకు అర్థం? బయట ఎవ్వరూ శత్రువులు లేరనే, స్వదేశో భువనత్రయం అన్న భావం కలిగిన తర్వాత, ఈనాడు కొందరు అంటున్నటువంటి అంతర్జాతీయ రాజ్యవ్యవస్థ అంటూ ఏర్పడినపుడు ఈనాడు మనం గొప్పగా అభిమానిస్తున్న దేశాబిమానం - పేట్రియాటిసం నేరమౌతుంది ఈనాడు ప్రాంతీయత క్రైమ్‌ అయినట్లుగా. అలాంటి ఇంటర్నేషనల్‌ రాజ్యం వచ్చి బాహ్యశత్రువులు అంటూ లేనప్పుడు అంతఃశత్రువులను జయించవలసి ఉంటుంది. ఆ పరిస్థితిలో జయ అనే శబ్దానికి అంతఃశత్రు విజయ మని అర్థం. 'మమాకాః పాండవాశ్చైవ' 'పాండు' అంటే శుభ్రం. తెలుపు అని అర్థం. హంస పక్షులవలె, తెల్లగా శుద్ధసత్త్వంగా ఉండే వారికి 'పాండవాః' అని అర్థం చెప్పుకోవచ్చును. దీనిని సత్త్వగుణానికీ, దైవీసంపత్తుకు, ప్రతీకగా తీసుకోవచ్చును. ఇలాగే మనహృదయంలో నాకు కావాలి. నాకు అవమానం కలిగించాడు, నాతో పోట్లాడుతున్నాడు, నేను, నాది 'మామాకాః' అనేభావం ఎక్కువగా కలుగుతూ వుంటుంది. ఇది అసురసంపద. దీని పాలుహెచ్చు. మరి కౌరవులసంఖ్య నూరుకదా? ఈ రెంటికీ, దేవాసుర సంసదలకు కలిగే పోరాటంలో జయంకావాలి అని అర్థం. ఇందులోనూ పాండవులకు జయంకావాలి అని అర్థం. ఇవే హృదయంలో ఉండే దేవాసుర వృత్తులు. 'కిమకుర్వత' అంటే ప్రపంచాన్ని ఏమోచేశారు అని అర్థం. సంజయ అనేసంబోధనం, నీవు సత్పురుషుడివిగా ఉండి, 'జయ' భువనత్రయాన్నీ నీదిగా భావించి, జయించు అని అర్థం. 'ప్రపంచంలో శాంతి స్థాపించేందుకు నీవొక సాధనగా కావలసినది' అని ప్రతి ఒక్కరికీ ఆదేశం ఇస్తున్నది. భారతయుద్ధం లోకకంటకులను జయించేందుకు తటస్థపడితే దర్మాధర్మముల మధ్య పోట్లాట అయితే శరీరంలో జరిగే ఈ భారతయుద్ధం '' సిద్ధ్యసిద్ధె సమో భూత్వా'' అనే సమబుద్ధిని అలవరచుకోవటం, మంచి చెడ్డ రెంటిపట్ల సమత్వం కలిగి ఉండటం బోధిస్తున్నది. ఈ దేహాన్ని ధర్మక్షేత్రం చేసి, అందులో సమత్వమనే యోగసిద్ధిని సాధించవలెనని తెలుపుతున్నది. అదే భారతసంస్కృతి; భారతీయ సంస్కృతియూ అదే.


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page